Water Pumped Out From Kherkatta Dam: డ్యామ్‌లో పడిన ఫోన్ కోసం రిజర్వాయర్లో నీళ్లను తోడేసిన ఆఫీసర్

ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సరదాగా డ్యామ్ వద్ద ఎంజాయ్ చేస్తున్న సమయంలో అతడి ఫోన్ డ్యామ్‌లో పడిపోయింది. ఆ స్మార్ట్ ఫోన్ ధర రూ. 1 లక్ష రూపాయలు. వాటర్ ఓవర్ ఫ్లో అయ్యే ఏరియాలోనే ఆ ఫోన్ పడిపోయింది. ఆ సమయంలో అక్కడ సుమారు 15 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే ఏం చేస్తారు.. ఇంతకీ ఈ ఆఫీసర్ చేసిన పని ఏంటో తెలిస్తే మీకు ఫ్యూజులు ఔట్ అవడం ఖాయం. 

Written by - Pavan | Last Updated : May 26, 2023, 08:50 PM IST
Water Pumped Out From Kherkatta Dam: డ్యామ్‌లో పడిన ఫోన్ కోసం రిజర్వాయర్లో నీళ్లను తోడేసిన ఆఫీసర్

Officer Pumped Out Water From Kherkatta Dam For His Smartphone: ఖరీదైన ఫోన్ డ్యామ్‌లో పడిపోయిందని ఓ అధికారి ఆ రిజర్వాయర్‌లో ఉన్న నీళ్లను ఎత్తిపోయించిన ఘటనను మీరు మీ జీవితంలో ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. కనీసం అలా ఎక్కడైనా జరిగినట్టుగా విని ఉన్నారా ? అది కూడా లేదు కదా.. కానీ ఇదిగో ఇక్కడ జరిగింది. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ ఘటనను అక్కడి స్థానికులు, రైతులు ప్రత్యక్షంగా మూడు రోజుల పాటు కళ్లారా చూశారు. మరి వాళ్ల రియాక్షన్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ఇంతకీ ఈ విచిత్రమైన ఘటన ఎక్కడ జరిగింది ? ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ చదవాల్సిందే.

చత్తీస్‌ఘడ్‌లోని కంకడ్ జిల్లా కొయిలిబెడ తాలూకాలోని ఖేరకట్ట డ్యామ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేశ్ విశ్వాస్ అనే ఫుడ్ ఇన్‌స్పెక్షన్ విభాగం అధికారి అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే అతడి ఫోన్ డ్యామ్‌లో పడిపోయింది. ఆ స్మార్ట్ ఫోన్ ధర రూ. 1 లక్ష రూపాయలు. వాటర్ ఓవర్ ఫ్లో అయ్యే ఏరియాలోనే ఆ ఫోన్ పడిపోయింది. ఆ సమయంలో అక్కడ సుమారు 15 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే.. తమ బ్యాడ్ లక్ అనుకుని సరిపెట్టుకుని ఊరుకుంటారు. లేదంటే తమ పొరపాటు వల్లే ఇలా జరిగింది అని తమని తాము నిందించుకుని సరిపెట్టుకుంటారు. కానీ రాజేశే విశ్వాస్ అలా చేయలేదు. రాజేశ్ విశ్వాస్ చేసిన పనికి మీకు ఫ్యూజులు ఔట్ అవడం ఖాయం.

డ్యామ్‌లో పడిన ఫోన్‌ని వెతికి తీసుకురావాల్సిందిగా రాజేశ్ విశ్వాస్ కొంతమంది స్థానికులను పురమాయించాడు. అసలే అధికారి.. పైగా హుకుం జారీ చేశాడు.. దీంతో ఆ అధికారి ఆదేశాల మేరకు స్థానికులు కొంతమంది నీళ్లో దూకి ఫోన్ కోసం వెదికినప్పటికీ.. ప్రయోజనం లేకపోయింది. రాజేశ్ విశ్వాస్ అంతటితో సరిపెట్టుకోలేదు... ఈసారి రెండు డీజిల్ ఇంజన్ మోటార్స్ తీసుకొచ్చాడు. 30Hp కెపాసిటీతో రన్ అయ్యే ఈ రెండు మోటార్లతో రిజర్వాయర్లోని నీటిని తోడటం మొదలుపెట్టాడు. అలా ఒక రోజు.. రెండు రోజులు కాదు.. ఏకంగా మూడు రోజుల పాటు నిరంతంరంగా మోటార్లు రిజర్వాయర్లోని నీటిని తోడటం మొదలుపెట్టాయి.  

ఇంతలోనే రాజేశ్ విశ్వాస్ ఆగడాలు చూసిన స్థానికులకు ఒళ్లు మండింది. పంట పొలాల అవసరాలకు పనికొచ్చే సాగు నీటిని ఒక ఫోన్ కోసం తోడిపారేస్తున్నారు అంటూ సాగు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి.. అక్కడ జరుగుతున్న తతంగం చూసి బిత్తరపోయాడు. అప్పటికే 21 లక్షల లీటర్ల నీటిని రిజర్వాయర్లోంచి ఎత్తిపోశారు. రాజేశ్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేసిన సదరు అధికారి.. ఉన్నఫళంగా నీళ్లను తోడుతున్న మోటార్లను ఆపేశారు. రాజేశ్ విశ్వాస్ తోడేసిన నీటితో ఎంత లేదన్నా సుమారు 1500 ఎకరాల పంట పొలాలకు నీరు అందించ వచ్చు అని ఒక అంచనా చెబుతోంది. 

రాజేశ్ విశ్వాస్ ఏం చెబుతున్నాడంటే..
ఇందులో తన తప్పేం లేదని.. తాను సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ వద్ద అనుమతి తీసుకున్నాకే నీటిని తోడానని రాజేశ్ విశ్వాస్ చెప్పుకొచ్చాడు. మూడ్నాలుగు అడుగుల మేర నీటిని తోడితే ఇబ్బంది లేదని సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చినట్టు రాజేశ్ విశ్వాస్ తెలిపాడు. 

అయితే, వాస్తవానికి రాజేశ్ విశ్వాస్ ఎక్కువ నీటిని తోడలేదు అని చెబుతున్నప్పటికీ... అతడు చేసిన నిర్వాకానికి రిజర్వాయర్లోంచి ఐదు అడుగుల కంటే ఎక్కువ నీరు ఖాళీ అయ్యిందని స్థానికులు చెబుతున్నారు. 

ఈ ఘటనపై స్పందించిన మంత్రి..
చత్తీస్‌ఘడ్ కల్చర్ మినిష్టర్ అమరజీత్ భగత్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తమకు ఈ విషయం తెలియదని.. అసలు వాస్తవాలు తెలుసుకుని సదరు అధికారిపై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. అయితే, ఇండియా టీవీలో వచ్చిన వార్తా కథనం ప్రకారం రాజేశ్ విశ్వాస్‌ని ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారి అయ్యుండి ఎంతో విలువైన నీటి వనరుల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన రాజేశ్ విశ్వాస్ చేసిన తెలివి తక్కువ పని ఇది. 

ఇంతకీ రిజర్వాయర్‌లో పడిన ఆ ఫోన్ దొరికిందా ???
ఇంతకీ ఆ ఫోన్ దొరికిందా లేదా అనే కదా మీ సందేహం.. నీళ్లలో పడిన తరువాత మూడు రోజులకు ఫోన్ లభించింది కానీ అప్పటికే అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఒక నీళ్ల బకెట్లో పడిన ఫోన్‌ని వెంటనే బయటికి తీసినప్పటికీ ఆ ఫోన్లు పని చేయని సందర్భాలే అనేకం ఉన్నాయి.. అలాంటిది డ్యామ్ నీళ్లలో పడిన ఫోన్ కోసం ఈ పిచ్చి పని చేసిన అధికారిని ఇంకేం అనాలో మీరే చెప్పండి. ఈ వార్తా కథనం కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని వెల్లడించండి.

Trending News