Revanth Reddy: రుణమాఫీపై కదలిక.. తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశం

Revanth Reddy Orders To Loan Waiver And Grain Purchase: చెప్పినట్టే ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పరిపాలనపై దృష్టి సారించారు. రుణమాఫీతోపాటు ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులకు రేవంత్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 15, 2024, 10:30 PM IST
Revanth Reddy: రుణమాఫీపై కదలిక.. తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశం

Revanth Reddy Review: లోక్‌సభ ఎన్నికల అనంతరం పరిపాలనపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రైతు రుణమాఫీపై సమీక్ష చేశారు. దాంతోపాటు ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖతోపాటు రుణమాఫీకి సంబంధించి అధికారులతో రేవంత్‌ రెడ్డి చర్చలు జరిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Kishan Reddy: రేవంత్‌ మాటలు విని నవ్వుకున్న ప్రజలు.. బీజేపీకే బ్రహ్మాండమైన ఫలితాలు

 

రుణమాఫీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలను అధికారులతో చర్చించారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు.

Also Read: Revanth Reddy Chitchat: ఇక రాజకీయం ముగిసింది.. పరిపాలనపై దృష్టి సారిస్తా

 

రైతుల సంక్షేమానికి సంబంధించి అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని లక్ష్యంగా ఎంచుకుందని.. నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 

భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే  బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సంబంధిత శాఖ అధికారులకు రేవంత్‌ రెడ్డి సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు. ఇక రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతుండడంతో వాటిపై కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులకు రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి చౌకధర దుకాణాల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News