Jitta Balakrishna Reddy: కేసీఆర్, బీజేపి ఒక్కటే.. మరోసారి జిట్టా సంచలన వ్యాఖ్యలు

Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా పేరున్న వారిలో ఒకరైన జిట్టా బాలక్రిష్ణ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారనే కారణంతో బీజేపి నుంచి సస్పెన్షన్ కి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జిట్ట బాలకృష్ణా రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపిపై మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర నాయకత్వానికి జిట్ట బాలకృష్ణా రెడ్డి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. 

Written by - Pavan | Last Updated : Jul 30, 2023, 10:06 AM IST
Jitta Balakrishna Reddy: కేసీఆర్, బీజేపి ఒక్కటే.. మరోసారి జిట్టా సంచలన వ్యాఖ్యలు

Jitta Balakrishna Reddy About Kishan Reddy and BJP: తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా పేరున్న వారిలో ఒకరైన జిట్టా బాలక్రిష్ణ రెడ్డి ఇటీవల సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారనే కారణంతో బీజేపి నుంచి సస్పెన్షన్‌కి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జిట్ట బాలకృష్ణా రెడ్డి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపిపై మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో ఎంతో కీలకంగా పని చేశాను. 2007 లోనే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కోసం ఎంతో పోరాడాను అని గుర్తుచేసుకున్న జిట్ట.. తెలంగాణ వచ్చాక కూడా ఆశయాలు నెరవేరడం లేదని మరోసారి ఉద్యమకారులను అందరినీ ఏకం చేస్తూ ముందుకి వెళ్లానన్నారు. బీజేపీలోకి వెళ్తే న్యాయం జరుగుతుంది అని తాను పెట్టిన యువ తెలంగాణ పార్టీని సైతం బీజేపీలో విలీనం చేశాను. కానీ అక్కడ ఒరిగిందేనీ లేదని జిట్ట బాలకృష్ణా రెడ్డి ఆరోపించారు.

మీటింగ్‌లు, బహిరంగ సభలు పెడితే సమస్యలు పరిష్కారం కావు అని బీజేపి నేతలకు సూటిగానే చెప్పాను. తెలంగాణలో మరో ఉద్యమం కోసం అలయ్ బలయ్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశాను. సొంతంగానే ఇవన్నీ చేస్తున్నందుకు బీజేపీనే ఓర్వలేకపోయిందని జిట్ట బాలకృష్ణా రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ కళా సమితిని స్థాపించి తెలంగాణ కోసం నినదించి, 1999 లో దారుణ హత్యకు గురైన బెల్లి లలితను సైతం ఈ సందర్భంగా జిట్ట బాలకృష్ణా రెడ్డి గుర్తుచేసుకున్నారు. 

పార్టీ నుంచి తన సస్పెన్షన్ గురించి జిట్ట బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ, తనని ఎందుకు సస్పెండ్ చేశారో కారణాలు చెప్పలేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో ఎమ్మెల్యే రఘునందన్, విజయ శాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్ర నాయక్‌లు కూడా ఉన్నారు. కానీ పార్టీ మాత్రం తనపై చర్యలు తీసుకుందన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ 7 రోజుల్లో వివరణ అడిగారు కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత ఇంకా వివరణ అడగడం ఏంటో వాళ్లకు తెలియాలి అని జిట్ట బాలకృష్ణా రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. 

కిషన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడిన జిట్ట బాలకృష్ణా రెడ్డి
బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మూడు సార్లు పనిచేసిన కిషన్ రెడ్డి పార్టీనే నాశనం చేశాడన్నారు. ఈ సందర్భంగా కేంద్ర నాయకత్వాన్ని సైతం జిట్ట బాలకృష్ణా రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేంద్ర నాయకత్వాన్ని 10 ప్రశ్నలు అడుగుతున్నానన్న జిట్ట బాలకృష్ణా రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా.. ఇలా కీలక నేతలు ఎవ్వరు తెలంగాణకు వచ్చినా వారంతా కేసీఆర్ అవినీతిపై, కాళేశ్వరంలో చోటుచేసుకున్న అవితీనిపై మాట్లాడి వెళ్లిన వాళ్లే కానీ ఎవ్వరూ కూడా తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని నిలదీశారు. 

సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై విచారణ ఏమైంది అని రాష్ట్ర ప్రజలకు సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన జిట్ట బాలకృష్ణా రెడ్డి.. కేసీఆర్‌తో బీజేపీ కుమ్మక్కు అయిందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి అన్నారు. దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. మరి కవిత సంగతి ఏమైందని ప్రశ్నించిన జిట్ట.. బీజేపీ కేసీఆర్ తో చేతులు కలిపింది కనుకే కవితపై చర్యలు తీసుకోవడం లేదనే సంకేతాలు వెళ్లాయన్నారు.

తాను కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నానని వస్తోన్న విమర్శలపై స్పందించిన జిట్ట బాలకృష్ణా రెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలా అక్కడికి వెళితే ఇక్కడకు ఎందుకు వస్తానన్నారు. తనపై విమర్శలు చేసిన నేతను ఉద్దేశిస్తూ.. నీలాగా నేను చేయను చిల్లర రాజకీయాలు చేయననని ఇక్కడే ప్రమాణం చేస్తాను అని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి ఒక సమైక్య వాది... అయితే తాను తెలంగాణ వాదిని అని అన్నారు. 

ఇది కూడా చదవండి : Jayasudha: బీజేపీలోకి జయసుధ..! ఎక్కడి నుంచి పోటీ అంటే..?

2012 లో బీజేపీని మహబూబ్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిపించానని గుర్తుచేసిన జిట్ట బాలకృష్ణా రెడ్డి.. తానే స్వయంగా బీజేపీ ఆఫీస్ ముందుకు బహిరంగ చర్చకు రావడానికి రెడీగా ఉన్నానని.. మరి మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. బిఎల్ సంతోష్ కేసు కారణంగా కేసీఆర్‌కి తలొంచిన బీజేపి.. మునుగోడులో కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి గెలవకుండా బీజేపీబత పని చేసిందన్నారు. బీజేపి రాజకీయాలను విమర్శిస్తూ.. మహారాష్ట్రలో పార్టీలను చీల్చింది కూడా ఆ పార్టీనే అని ఆరోపించారు. అందరు ఉద్యమకారులను కలిసి మాట్లాడుతానని.. అలాగే తన నియోజకవర్గం నేతలు, కార్యకర్తలను కూడా సంప్రదించి సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను అని జిట్ట బాలకృష్ణా రెడ్డి స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : Uttam Kumar Reddy: బీఆర్ఎస్‌లో చేరికపై ప్రచారం.. బాంబ్ పేల్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇది ఆయన పనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News