వైరల్ వీడియో ఎఫెక్ట్ : ఐదేళ్ల కూతురితో స్కూటర్ డ్రైవింగ్.. తండ్రి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

ఐదేళ్ల కూతురితో స్కూటర్ డ్రైవింగ్.. తండ్రి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

Last Updated : Jul 31, 2018, 04:45 PM IST
వైరల్ వీడియో ఎఫెక్ట్ : ఐదేళ్ల కూతురితో స్కూటర్ డ్రైవింగ్.. తండ్రి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురితో స్కూటర్ డ్రైవింగ్ చేయించిన నేరాన్ని తీవ్రంగా పరిగణించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్‌మెంట్ అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేసిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఎర్నాకులం జిల్లా ఈడపల్లి వద్ద జాతీయ రహదారిపై స్కూటర్‌పై వెనకాల తన భార్యను ఎక్కించుకున్న ఓ వ్యక్తి, ముందర కూర్చున్న ఐదేళ్ల కూతురు ఆ స్కూటర్ నడిపేందుకు అనుమతించాడు. అదే సమయంలో ఆ రహదారిపై కారులో వెళ్తున్న మరో ప్రయాణికుడు ఆ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ వీడియో వైరల్ అవడం వెనువెంటనే జరిగిపోయాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోను చూసిన కేరళ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. 

 

ఈ విచారణలో సదరు వాహనం రామచంద్రన్ అనే వ్యక్తిపేరిట నమోదై ఉండగా ఆ సమయంలో ఆ వాహనాన్ని షిబు ఫ్రాన్సిస్ అనే మరో వ్యక్తి ఉపయోగించినట్టు గుర్తించారు. దీంతో ఈ నేరానికి పాల్పడిన షిబు డ్రైవింగ్ లైసెన్స్‌ని ఏడాదిపాటు రద్దు చేస్తున్నట్టు ఈ ఘటనపై విచారణ చేపట్టిన స్థానిక రవాణా శాఖ అధికారి ఆదేశాలు జారీచేశారు.  

Trending News