Rahul Gandhi - Amethi: అమేథిను పూర్తిగా వదిలేసుకున్న గాంధీ కుటుంబం.. ఓటమి భయంతోనేనా.. ?

Rahul Gandhi - Amethi: ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నియోజకవర్గానికి పెద్ద చరిత్రే ఉంది. ఈ నియోజకవర్గం ఎన్నో దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది. తాజాగా ఈ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తికి కాకుండా.. వేరే వ్యక్తికి ఎంపీ టికెట్ కేటాయించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 3, 2024, 01:49 PM IST
Rahul Gandhi - Amethi: అమేథిను పూర్తిగా వదిలేసుకున్న గాంధీ కుటుంబం.. ఓటమి భయంతోనేనా.. ?

Rahul Gandhi - Amethi: ఉత్తర ప్రదేశ్‌ దేశంలోని అత్యధిక లోక్‌సభ ఎంపీలున్న రాష్ట్రం. ఇక్కడ  అమేథి, రాయబరేలి నియోజకవర్గాలు గత కొన్ని దశాబ్దాలుగా గాంధీ నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అయిన అమేథిని విడిచిపెట్టి.. తన తల్లి మొన్నటి వరకు ప్రాతినిథ్యం వహించిన రాయబరేలి నుంచి పోటీకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాయనాడ్‌లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ సేఫ్ సైడ్‌గా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ సారి కేరళోని వాయనాడ్‌లో రాహుల్‌ గాంధీకి పోటీగా సీసీఎం, బీజేపీ బలమైన అభ్యర్ధులను నిలబెట్టింది. దీంతో ఓటమి భయంతోనే రాహుల్.. తిరిగి యూపీలోని రాయబరేలి నుంచి బరిలో దిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే.. రాహుల్ గాంధీ.. గత మూడు పర్యాయలు పోటీ చేసి గెలిచిన అమేథి నుంచి కాకుండా.. రాయబరేలి నుంచి ఓటీ చేయడమే పొలిటికల్ హీట్ పెంచుతోంది. అక్కడ నుంచి రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక వాద్రా ఎంపీగా పోటీ చేయబోతున్నారనేది గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ అందరికి షాక్ ఇస్తూ..తనే రాయబరేలి నుంచి బరిలో దిగడం రాజకీయంగా ఆసక్తి రేకిస్తోంది. పార్టీలో చెల్లెలు మరో పవర్ సెంటర్‌గా మారకుండా ఉండేందుకే రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సభ్యులు ఉభయ సభల్లో ఉండటం ఇష్టం లేకనే తన చెల్లెలు ప్రియాంక వాద్రాకు అక్కడ టికెట్ ఇవ్వకుండా తనే బరిలో నిలిచారు. అటు అమేథి నుంచి ప్రియాంకను బరిలో దింపకుండా.. అమేథి, రాయబరేలిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తోన్నకిషోరి లాల్ శర్మను బరిలో దింపారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న రెండో శర్మ కావడం విశేషం. గత నాలుగున్నర దశాబ్దంలో 31 యేళ్లు ఈ స్థానం నుంచి గాంధీ కుటుంబ సభ్యులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు.

ఇదీ చదవండి: ఎండలా.. నిప్పులా కొలిమా.. ? పలు రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు..

అమేథి నియోజకవర్గంలో తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఎంపీగా తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి 1991 రాజీవ్ గాంధీ మరణం వరకు ఆయన ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. ఆయన మరణంతో ఏర్పడిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సతీష్ శర్మ అమేథి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 1996లో కూడా రెండోసారి ఆయనే ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1998లో ఒక్కసారి మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ సీటును కైవసం చేసుకుంది. ఆ పార్టీ తరుపున సంజయ్ సింగ్ ఎంపీగా గెలిచారు. 1999లో సోనియా గాంధీ తొలిసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు. ఇక 2004, 2009, 2014లో రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ఎంపీగా హాట్రిక్ విజయాలను నమోదు చేసారు. గత 2019 ఎన్నికల్లో తన సమీప బీజేపీ అభ్యర్ధి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి అమేథీలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. ఇపుడు 2024లో కిషోరి లాల్ శర్మకు ఈ సీటును కేటాయించారు. చెల్లెలు అమేథి సీటు ఇచ్చినా.. ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందనే ఉద్దేశ్యంతో గాంధీ కుటుంబానికీ చెందని వ్యక్తికి  ఈ సీటు కేటాయించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

పంజాబ్‌కు చెందిన కిషోరి లాల్ శర్మ లూథియానా నుంచి అమేథికి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. 1999లో సోనియా గాంధీ తొలిసారి ఎంపీగా పోటీ చేసినపుడు అమేథిలో అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ అధిష్ఠానం కల్పించింది.

రాహుల్ గాంధీ తొలిసారి పోటీ చేస్తోన్న రాయబరేలి నియోజకవర్గం విషయానికొస్తే.. ఈ సీటు ఆయన తాత ఫిరోజ్ గాంధీతో పాటు నానమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీ ఎంపీలుగా గెలిచి చట్ట సభల్లో ప్రవేశించారు. ఇక 1996, 99 ఎన్నికల్లో మాత్రం ఈ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ రాయబరేలి నుంచి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపీగా నామినేట్ అయ్యారు. ఇక తాజాగా 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయబరేలి నుంచి బరిలో దిగడంతో ఈ ఎంపీ స్థానంపై అందరి దృష్టి కేంద్రీకరించబడింది. మరి తన ఫ్యామిలీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెడతారా లేదా అనేది చూడాలి. ఇక్కడ ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:  హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..

Trending News